విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించామని... కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారని అన్నారు.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుర్గమ్మ దేవస్థానానికి 85 వేల మంది ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, వారిలో దాదాపు 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారని ఆయన తెలిపారు. నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ ఏర్పాటు చేశామని అన్నారు.
ఈవో ఎంవీ సురేష్ బాబు మాట్లాడుతూ... భక్తుల సౌకర్యాలు, రక్షణ చర్యలకు ఏవిధమైన లోటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.