తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మిత్రపక్షం అధికారంలో వుండి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం ఘోర తప్పిదమని.. రైల్వే జోన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని కుంటిసాకులు చెప్తోందని మండిపడ్డారు.
కేంద్ర విద్యా సంస్థలకు మొక్కుబడిగా నిధులిచ్చారని.. రూ.4,500 కోట్లు అడిగితే రూ.218 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్‌ల గురించిన ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం దారుణమని తెలిపారు.
తమ అధినేత చంద్రబాబునాయుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎంతో సహనంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర విద్యా సంస్థలకు ఏపీ సర్కారు 3658 ఎకరాలను కేటాయించిందని, నామ మాత్రపు చర్యలతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరికాదన్నారు.