హైదరాబాదులో ఉద్యోగం.. ఇంట్లో పిండివంటలు చేస్తున్నారు.. ఫోన్‌లో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని?

సోమవారం, 19 జూన్ 2017 (16:09 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ యువత సెల్ఫీలు, పోస్టులు, లైక్లు, షేర్ల కోసం పాకులాడుతున్నారు. ఇంకా ఫోన్లలో మాట్లాడుతుంటే చుట్టూ ఏం జరుగుతుందో మరిచిపోతున్నారు. తమ చుట్టూ ఏం జరిగినా ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. తాజాగా తెల్లవారుజామున 3.30 గంటలకు ఫోన్ మాట్లాడిన బీటెక్‌ విద్యార్థిని నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే ఒంగోలు పట్టణంలోని, భాగ్యలక్ష్మి నగర్, మహాలక్ష్మి అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్న త్రిపుర అనే బీటెక్ విద్యార్థిని ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుంది. హైదరాబాదులో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఆమె హైదరాబాదుకు బయల్దేరుతుందని.. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు పిండివంటలు చేశారు. దీంతో తెల్లవారుజాము 3 గంటల వరకు కుటుంబ సభ్యులు మేల్కొని ఉన్నారు. 
 
అయితే మేడమీదకి ఫోను మాట్లాడటం కోసం వెళ్లిన త్రిపుర అక్కడి నుంచి జారిపడింది. కిందపడగానే తలకు తీవ్రంగా గాయం తగలడంతో అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోయింది. బాగా చదువుకుని ఉద్యోగానికి వెళ్తుందనుకున్న బిడ్డ.. ఇలా ప్రాణాలు కోల్పోవడంపై త్రిపుర తల్లిదండ్రులు రోదిస్తున్నారు. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లో విషాదం నెలకొంది.
 
హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో త్రిపురకు ఉద్యోగం లభించిందని, టిక్కెట్లు బుక్ చేశామని.. బాల్కనీ గోడపై వాలి ఫోనులో మాట్లాడుతున్న త్రిపుర అదుపు తప్పి కిందపడిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి