ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతోందని, ఈ మాటలు తాను అనడం లేదని తమ పార్టీ నేతలే అంటున్నారని అధికార వైకాపాకు చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను అరికట్టలేని వారికి పదవులు అవసరమా అని ప్రశ్నించారు. తనకు ఆరు నెలల పాటు హోమంత్రి పదవి ఇస్తే తానేంటో చూపిస్తానని ఆయన అన్నారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ, దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ నుంచే వచ్చిందని అంటున్నారని చెప్పారు. తమ వైకాపా నేతలో గంజాయి వ్యాపారం చేస్తున్నారని చెప్పుకుంటున్నారని అన్నారు. గంజాయి సరఫరాను కూడా నియంత్రించలేని వారికి పదవులు అవసరమా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. తనకు ఆరు నెలల పాటు హోం మంత్రి పదవి ఇస్తే తానేంటో చూపిస్తానని, గంజాయి అనే మాట వినపడకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటికే గంజాయి తాగొద్దు బ్రో అనే నినాదాన్ని నారా లోకేశ్ ఇచ్చారని ఆర్ఆర్ఆర్ గుర్తు చేశారు.
ఇకపోతే, తనకు మీడియా లేదని జగన్ అంటున్నారని... మరి సాక్షి మీడియా ఎవరిదని రఘురాజు ప్రశ్నించారు. సాక్షి ఛైర్మన్ ఆయన భార్య వైఎస్ భారతీనే కదా అని అడిగారు. సాక్షి ఛానల్, సాక్షి పేపర్ రెండూ జగన్మోహన్ రెడ్డివేనని అన్నారు. అలాగే, రాష్ట్రంలోని మరికొన్ని ఇతర తెలుగు మీడియాలు కూడా ఎవరి కోసం పని చేస్తున్నాయో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమన్నారు.
తనపై కేసులు లేవని జగన్ అంటున్నారని... కానీ, ఎన్నికల అఫిడవిట్‌లో కేసులు ఉన్నట్టు ఎందుకు పేర్కొన్నారని గుర్తుచేశారు. ఆర్థిక బలం, అంగ బలం లేదని చెప్పారని... మరి దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ ఎలా అయ్యారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో లిక్కర్, ఇసుక, మట్టిలో ఎంతో వెనుకేశారని ఆరోపించారు. అంబానీ, అదానీ తర్వాత దేశంలో జగనే సంపన్నుడు అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.