పెన్షన్ టెన్షన్.. సచివాలయ మెట్లపైనే పోయిన ప్రాణం

శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:57 IST)
ఏపీలోని బాపట్ల జిల్లాలో పెన్షన్ టెన్షన్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లిన ఆయనకు.. పింఛన్ వస్తుందో రాదో అన్న భయంతో మెట్లపైనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన గురువారం చోటు చేసుకుంది. 
 
బాపట్ల జిల్లా నగరం మండలం అద్దంకివారి పాళెంకు చెందిన మస్తాన్ రావు (78) అనే వృద్ధుడికి వలంటీరు ఈ నెల ఒకటో తేదీన పింఛను ఇవ్వలేదు. పైగా, వలంటీరు ఇంటికి రాకపోవడంతో విసుగు చెందిన వృద్ధుడు సచివాలయానికి వెళ్లాడు. 
 
వేలిముద్రలను యంత్రం తీసుకోవడం లేదని, ధ్రువపత్రాలతో రావాలని అక్కడి అధికారులు ఆయనకు సూచించారు. అలా ఒకటికి మూడు సార్లు ఇంటికి, కార్యాలయానికి తిరిగిన వృద్ధుడు సచివాలయం మెట్లెక్కుతూ కుప్పకూలారు. 
 
అధికారులు 108కి సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని కుమారుడు వెంకటేశ్వరరావు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు