ఎగువన వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద గురువారం 9.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీకి చెందిన 175 గేట్లను 0.70 మీటర్ల ఎత్తు లేపి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద పెరగడంతో రాజమహేంద్రవరంలోని బ్రిడ్జిలంక, కేదార్లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.
సీతానగరం మండలం ములకల్లంక జలదిగ్బంధంలో ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు నాలుగు వేల క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద బుధవారం అర్థరాత్రి నుంచి ఒక్కసారిగా పెరగడంతో దేవీప్నటం మండలంలోని ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాఫర్ డ్యాం నుంచి వరద నీరు వెనక్కి వస్తుండటంతో తొయ్యేరు, పూడిపల్లి గ్రామాల్లోని దళితవాడలు, దేవీపట్నంలోని జాలరిపేట వద్ద ఇళ్లవద్దకు గోదావరి వరద చేరుతోంది.
ప్రధాన రహదారిపైకి వరద రావడంతో దేవీపట్నం, తొయ్యేరు, పెనికిలపాడు, మంటూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆదేశించడంతో ఐటిడిఎ అధికారులు రంగంలోకి దిగారు.