తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ పరిశుభ్రమైన నీరు ప్రజలకు ఎక్కడా అందే పరిస్థితి లేదు. వర్షాల సీజన్లోనూ, వరదలు ముంచెత్తే కాలంలో అయితే ఇంకా దుర్భరమైన స్థితి. అంతంత మాత్రంగా ఉన్న నీటివనరులూ బురదలో, మురుగు కాలువల నుంచి వచ్చిన నీటితో కలుషితమై పోతున్నాయి. దీంతో ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే ఏదో ఒక ఆరోగ్య సమస్యకి గురికావడం సహజంగా మారింది. వీటిలో మొదటిశ్రేణిలో ఉన్నవి అతిసారం, మలేరియా, డెంగీ వ్యాధులు.
అతిసారం
వరదల వల్ల, వర్షాల కారణంగా నీటి వనరులు కలుషితమై పోవడంతో వెంటనే వచ్చే వ్యాధి అతిసారం. దీన్నే డయేరియా అంటారు. ఇది మామూలుగా రోటా వైరస్ వల్ల వస్తుంది. ఎక్కువగా విరేచనాలు కావడం దీని లక్షణం. వీటితో పాటు రక్తం పడితే దానిని 'డీసెంట్రి' అంటారు. ఇది వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసారం వ్యాధి. ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువసార్లు వదులుగా విరేచనాలు అవుతుంటే దానిని అతిసారం అంటారు.
లక్షణాలు
వాంతులు, విరేచనాలు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, డీసెంట్రి అయితే రక్త విరేచనాలు, వికారంగా ఉండడం, అన్నహితం లేకపోవడం, మాములుగా ఈ వ్యాధి రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. పిల్లల్లో అతిసారం సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల లోపల తగ్గిపోతుంది. లేదంటే రెండు వారాల వరకూ ఉంటుంది. పెద్దవారిలో సాధారణంగా రెండు నుండి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. విరోచనం పరీక్ష, రక్తపరీక్షలు రక్తంలో లవణాలు ఎలా ఉన్నాయో పరిశీలించి నిర్ధారిస్తారు.
చికిత్స
లవణాలతో నిండిన నీరు తాగాలి. వాంతుల వల్ల నీరు తాగలేకపోతే నరాలలోకి లవణాలతో నిండిన నీరు (సెలైన్) ఎక్కించాలి. తగినంత విశ్రాంతి ఇస్తూ అవసరమైన మాత్రలు వాడాలి.
మలేరియా
మలేరియా ఈ వరదల సీజన్లోనే కాదు.. దాదాపుగా ఏడాది పొడవునా కనిపించే ఆరోగ్య సమస్య. అయితే వర్షాలు, వరదల సీజన్లో ఎక్కడిక్కడ మురుగునీరు మడుగులు కట్టడడంతో అది దోమలకు నిలయమైపోతుంది. ఇలాంటి సమయాల్లోనే మలేరియా విజృంభణ ఎక్కువగా ఉంటుంది. మలేరియాను కలుగజేసే పరాన్నజీవి ప్లాస్మోడియం. ఇది అనాఫిలిస్ దోమ కాటు ద్వారా మనిషిలోకి చేరి, మలేరియాకు కారణమవుతుంది. ఇది ప్రాణాంతక వ్యాధి.
లక్షణాలు
ఆడ అనాఫిలస్ దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10-15 రోజుల్లోపు మలేరియా లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఏ జ్వరంలోనైనా కనిపించేవే. ఈ లక్షణాలను బట్టి మలేరియాను నిర్ధారించడం కష్టమే.
మాములు జ్వరమే కదా అని ఏ పారాసిటమాల్ టాబ్లెటో వేసుకుంటే అప్పటికి జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినప్పటికీ, రెండు-మూడు గంటల వ్యవధిలో తిరిగి జ్వరం వస్తుంది. మలేరియా జ్వరం రాత్రుళ్లు ఎక్కువగా ఉంటుంది.
చెమటలతో జ్వరం తగ్గి, కొంత విరామంతో తరచుగా జ్వరం వస్తూ ఉంటే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
రకాలు
మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్న జీవి నాలుగు రకాలు. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవలే, ప్లాస్మోడియం మలేరియే. వీటిని ప్రత్యేకంగా నిర్ధారించడానికి యాంటిజెన్, స్మియర్ టెస్ట్‌లు తప్పనిసరి. యాంటిజెన్ పరీక్షల్లో చాలా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ చాలా ప్రమాదకరమైన సెరిబ్రల్ మలేరియాకు
కారణమవుతుంది.
చికిత్స
మలేరియా జ్వరం అయినా ఏ రకమైన మలేరియా అనే అంశం మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. సాధారణంగా ప్లాస్మోడియం వైవాక్స్ చికిత్సకు క్లోరోఫిన్ అనే మందునే వాడతారు. తర్వాత 14 రోజుల పాటు ప్రైమోక్విన్ అనే మందును ఉపయోగిస్తారు.
అయితే కొంతమందిలో క్లోరోఫిన్ మందు పనిచేయదు. దీనిని క్లోరోఫిన్ రెసిస్టెంట్ మలేరియా అంటారు. వీరికి రెండు, మూడు రకాల కాంబినేషన్‌లో మందులు వాడాలి. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్ల కలిగే మలేరియాను సెరిబ్రెల్ మలేరియా అంటారు. ఈ రకమైన జ్వరానికి క్వినైన్ అనే మందును వాడాలి.
డెంగీ
దోమకాటు వల్ల వచ్చే తీవ్రమైన జ్వరం డెంగీ. దీని పేరు వినగానే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఇది సోకితే శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయి, మనిషి నీరసంగా తయారవుతాడు. సకాలంలో తగిన చికిత్స చేయకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. ఈ వ్యాధికి ఆర్బోవైరసం జాతికి చెందిన వైరస్ కారణం. ఇది అతి సూక్ష్మమైనది. మామూలుగా కంటికి కనిపించదు.
ఈ వైరస్ ఎయిడిస్ ఈజిప్టి జాతి దోమద్వారా రోగగ్రస్తుల నుండి ఆరోగ్య వంతులకు సంక్రమిస్తుంది. ఈ దోమనే టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడతాయి. ఈ దోమలు కుట్టిన తర్వాత వారం రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇంటి పరిసరాల్లో నీరు కనీసం వారం రోజులు నిల్వ ఉంటే, ఈ వ్యాధికారక దోమలు వృద్ధి చెందుతాయి.
జాగ్రత్తలు అవసరం
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వరదల సమయంలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
- నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.