ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన దేవాలయాల వద్ద మకాం వేసి భక్తులను ఆకట్టుకునే బోగస్ బాబా కోసం రెండు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక పూజల ముసుగులో భక్తులకు శఠగోపం పెట్టే బురిడీబాబా ఆలయాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటాడు. భక్తుల్ని ఆకట్టుకునేందుకు కట్టూబొట్టుతో ప్రత్యేకంగా అలంకరించుకుంటాడు. ఒంటినిండా కిలోన్నరకు పైగా బరువుండే ఆభరణాలు ధరిస్తాడని సమాచారం.
అందుకే.. భక్తులు ఇతడిని ముద్దుగా గోల్డ్‌బాబాగా పిలుస్తుంటారని తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల వద్ద అతడి అనుచరులు తిష్ఠ వేస్తారు. భార్యాభర్తల మధ్య తగాదాల పరిష్కారం, విడిపోయిన దంపతులను కలిపేందుకు ప్రత్యేకంగా పసిడితో పూజలు చేసి బంగారు కాపురంగా మారుస్తారంటూ ఊదరగొడతారు. ప్రముఖ ఆలయాల వద్ద గోల్డ్‌బాబా స్వయంగా మకాం వేస్తారని తెలుస్తోంది.
భార్యాభర్తల మధ్య వివాదాలు తలతెత్తితే వారిని ఈ బాబా హోటల్ రూముకు తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలంటూ ప్రారంభిస్తారు. రెండు గంటల తర్వాత సాగేతంతులో భార్యాభర్తలు ధరించిన బంగారు ఆభరణాలను పూజలో ఉంచమంటారు. పూజ ముగిసే ముందు వారిద్దరికీ తీర్థప్రసాదం అంటూ.. మత్తుమందు కలిపిన ద్రవాన్ని ఇస్తారు. చెరో సగం తాగమని ఆలుమగలకు సూచిస్తారు.
వారిద్దరూ మత్తులోకి చేరగానే పూజలో ఉంచిన బంగారాన్ని కాజేసి అక్కడ నుంచి మాయ మవుతారు. గోల్డ్‌బాబా భారినపడిన బాధితుల్లో కొందరు ప్రముఖులు, వ్యాపారులూ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతోమంది అమాయకులను బురిడీ కొట్టించినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ దొంగ బాబా కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు.