ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా పోలీసలకు వారాంతపు సెలవును ప్రకటించారు. ఈ వీక్లీ ఆఫ్ బుధవారం నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవిశంకర్ ఉత్తర్వులు జారీచేశారు.
పోలీసుల విక్లీ ఆఫ్‌పై ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. నవ్యాంధ్రలోని పోలీసు శాఖలో పని చేసే కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు పని చేసే పోలీసులకు వారాంతపు సెలవును మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీక్లీ ఆఫ్ విధానం ఇప్పటికే విశాఖపట్టణం జిల్లాలో అమలు చేస్తుండగా, ఇపుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఈ వారాంతపు సెలవుతో పోలీసులు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని, తద్వారా అనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. పైగా, వీక్లీ ఆఫ్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని ఆయన వెల్లడించారు.