అనాధల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్న గవర్నర్ బిశ్వభూషణ్

సోమవారం, 28 అక్టోబరు 2019 (21:00 IST)
ఆహ్లాద భరిత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మునుపెన్నడూ జరగని రీతిలో గవర్నర్ అనాధల మధ్య దీపావళి వేడుకలను జరుపుకోవటమే కాక, వారితోనే దీపావళి విందు స్వీకరించి, నూతన వస్త్రాలు, మిఠాయిలతో వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు. విజయవాడ రాజ్ భవన్‌లో ఆదివారం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన దీపావళి వేడుకల్లో గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహితంగా వేడుకలను నిర్వహించటం ద్వారా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉన్నతమైన సందేశాన్ని అందించారు. దీపావళి సందర్భంగా టపాసులకు దూరంగా రాజ్ భవన్‌లో కార్యక్రమాలు జరిగాయి. రాజ్ భవన్ ప్రాంగణాన్ని  రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో అలంకరించగా, అది అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది.
 
దీపావళి వేడుకలలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్ర ప్రధమ పౌరుడు శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్, ప్రధమ మహిళ శ్రీమతి సుప్రవ హరిచందన్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహాతులను అలరించగా, ఘంటసాల సంగీత కళాశాల విద్యార్థుల ఆహ్వాన గీతం, అనాధ పిల్లల యోగా ప్రదర్శన, మిమిక్రీ, మ్యాజిక్ షో, డప్పులు, జానపద నృత్యం, లంబాడా నృత్యం తదితర అంశాలు అదరహో అనిపించాయి. కూచిపూడి నృత్య రూపకంతో చిన్నారులు గవర్నర్ ను స్వాగతించటం ప్రత్యేకతను సంతరించుకుంది.  గంటకు పైగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం గవర్నర్ దంపతులు అనాథ పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వారిని ఉచిత రీతిన సత్కరించారు.
 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చెడుపై మంచి విజయాన్ని సాధించటానికి సూచికగా దీపావళి వేడుకలను జరుపుకుంటామన్నారు. పండుగ శుభవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  అంతా మంచి జరగాలని తాను కోరుకుంటున్నానని, ప్రతి కుటుంబ జీవనం ఆనందమయం కావాలని పేర్కొన్నారు. శాంతి, స్నేహం, మత సామరస్యం ప్రబలంగా ఉన్న సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

అయితే ప్రోటోకాల్ ను తిరస్కరించి అనాధ బాలల మధ్య కూర్చుని గవర్నర్ భోజనం చేయటం ఇక్కడ ప్రత్యేకతకు దారి తీసింది. అధికారులు చేసిన ప్రత్యేక భోజన ఏర్పాట్లను పక్కనపెట్టిన గవర్నర్ అనాథ పిల్లలతో కలిసి కూర్చుని వారితో సంభాషించడానికి ఇష్టపడ్డారు. పిల్లలతో మమేకమైన గవర్నర్ వారికి స్వయంగా ఆహార పదార్ధాలు వడ్డింపచేస్తూ, యోగ క్షేమాలను తెలుసుకున్నారు. చిన్నారులకు మరిచిపోలేని జీవితకాల అనుభవాన్ని అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు