హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : నరసింహన్

సోమవారం, 5 మార్చి 2018 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హేతబద్ధత లేకుండా జరిగిందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన సమస్యల పరిష్కారానికి ఏ అవకాశం వచ్చినా వదిలి పెట్టేదిలేదన్నారు.
 
విభజన వల్ల ఉత్పన్నమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడటంతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయామని తెలిపారు. ఆదాయం, ఆస్తుల పంపిణీలో హేతుబద్ధత లేని విభజన జరిగిందని విమర్శించారు. 58 శాతం ఉన్న జనాభాకు 46 శాతం రాబడి ఇవ్వడం అన్యాయమని గవర్నర్ అన్నారు. 
 
9, 10 షెడ్యూల్‌ ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలన్నారు. కేంద్ర నిధులతో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విభజన హామీలు అమలు చేయాలన్న ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా, ఆర్థికలోటు రైల్వేజోన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ క్రూడాయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, రాజధానికి ఆర్థికసాయం నేటికీ నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్‌, విశాఖ - చెన్నై కారిడార్‌, విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌, అమరావతికి ర్యాపిడ్‌ రైలు - రోడ్డు అనుసంధానం వంటివి నెరవేర్చాల్సి ఉందని గవర్నర్ చెప్పుకొచ్చారు.
 
విభజన సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా పోరాడుతున్నామన్న ఆయన ప్రజల డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయంలో ఏపీ వెనుకబడి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రూ.35 వేలు వెనుకబడి ఉన్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం సాయమందించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. 
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. 2018-19లో 10 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని, క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు అందజేస్తామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తామన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అదుపు చేశామన్న గవర్నర్ శాంతిభద్రతల యంత్రాంగంలో సంస్కరణలు తీసుకొస్తామని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు