గవర్నర్ వ్యవస్థపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు మాట్లాడేది ఎక్కువ.. వినేది తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు గవర్నర్, తమిళనాడు ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా, డీఎంకే సర్కారు రాష్ట్రంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ బిల్లును తయారు చేసి పంపించగా, దాన్ని ఆయన తిరస్కరించారు. అలాగే, మరికొన్ని బిల్లులను కూడా ఆయన ఆమోదించకుండా తిప్పిపంపించారు.
ఈ నేపథ్యంలో "ఉంగలిన్ ఒరువన్" పేరుతో రాసిన తన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. ఇందులో సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గవర్నర్లు పాటిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇప్పటివరకు గవర్నర్ల చర్యలను గమనిస్తే, వారికి నోరు ఉంది కానీ, చెవులు లేవు అనిపిస్తుంది అంటూ వంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టుపై కూడా స్పందించారు. ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగా ఎలా బెదిరిస్తుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. రాజకీయ కారణాలతో వారు దర్యాప్తుసంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. మనీశ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.