బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూళ్లు: ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (23:08 IST)
బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూలుపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ స్పష్టం చేసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వనరుల సేకరణలో ఎటువంటి అలసత్వం కూడదని హెచ్చరించారు. పన్ను వసూలులో మెరుగైన ఫలితాలు సాధించటానికి ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని అయా విభాగాలను ఆదేశించారు.
 
రాష్ట్ర రెవిన్యూ వసూళ్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో రజత్ భార్గవ ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, లిక్కర్, సౌర విద్యుత్ పరికరాలు, సౌర విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి జిఎస్టి అంశంపై సమావేశంలో చర్చించారు. ఆయా సమస్యలపై పూర్తి వివరాలతో విడివిడిగా స్పష్టమైన ప్రతులను సిద్దం చేయాలన్నారు.
 
శుక్రవారం లక్నోలో జరగనున్న 45వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ అంశాలను తీసుకురావాలన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య విధానం మేరకు రాష్ట్ర ఆదాయ ప్రయోజనాలు, రాష్ట్రాల పన్నుల అధికారాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. పన్ను చెల్లింపుదారులు నెలవారీ రిటర్నులు దాఖలు చేసేలా సమాయత్తం చేయాలని, బకాయిల వసూలుపై కూడా దృష్టి సారించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
 
వివిధ కోర్టు కేసుల వల్ల నిలిచి పోయిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసే క్రమంలో ఒక తార్కిక ముగింపును ఎంచుకోవాలన్నారు. ఎపిఎస్ డిఆర్ఐ సమీక్ష సందర్భంగా రజత్ భార్గవ మాట్లాడుతూ అయా రంగాల వారీగా పన్ను సేకరణ, విశ్లేషణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమాచార విశ్లేషణ ఆధారంగా ఎగవేతదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. భారీ పన్ను చెల్లింపుదారుల విషయంలో జిఎస్‌టి మోసాలను వెలికితీసేందుకు ఆడిట్ విభాగాన్ని బలోపేతం చేయాలని, క్రమపద్ధతిలో ముందడుగు వేయటం ద్వారా రాష్ట్ర పన్ను పరిధిని విస్తృతం చేయాలని సూచించారు. 
 
ఎపిఎస్ డిఆర్ఐ ద్వారా రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగట్టు రావలసినదిఎంత, వచ్చింది ఎంత అన్న అంశంపై సమావేశంలో చర్చించారు. మరోవైపు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను కూడా రజత్ భార్గవ సమీక్షించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల కమీషనర్ రవిశంకర్ నారాయణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచాలకులు రాజేశ్వర్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు