తాడేపల్లి సీతానగరం కేసులో పురోగతి.. 2 నెలల తర్వాత నిందితుల అరెస్టు

శనివారం, 7 ఆగస్టు 2021 (13:36 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో పురోగతి లభించింది. సుమారు రెండు నెలల తర్వాత కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రహస్య ప్రాంతంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. 
 
ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు. పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగి గాలించి మరీ పట్టుకున్నారు. నిందితుడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు.
 
కాగా, రెండు నెలల క్రితం పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట గత జూన్‌లో సాయంత్రం వేళ గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల దగ్గర సేద దీరేందుకు వెళ్లింది. వీరిని చూసిన నిందితులు జంటపై దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో నిందితులను వెంకటరెడ్డి, షేర్ కృష్ణగా గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరు ఫోన్ ఉపయోగించకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగారు. సమోసాలు అమ్మేవారిలా, ఫుడ్ డెలివరీ బాయ్స్‌లా మారి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
నిందితులకు గంజాయి తాగే అలవాటు ఉండడంతో అది తాగే ప్రదేశాల్లోనూ కాపుకాశారు. ఈ క్రమంలో నిందితుడు కృష్ణ హైదరాబాద్‌లో క్యాటరింగ్ పనులు చేస్తూ రైల్వే బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నట్టు గుర్తించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పోలీసు ప్రత్యేక బృందాలు షేర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు