దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్

శనివారం, 7 ఆగస్టు 2021 (16:53 IST)
దేశంలోని ఖాదీ పరిశ్రమను ప్రోత్సాహించి చేనేత కార్మికులు ఆర్ధికంగా నిలదొక్కుకొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినట్లు చెప్పారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
 
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ ముందుగా నూలు వడుకు యంత్రాలను పరిశీలించి, వివరాలను నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘ భవనం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ఖాదీ కార్మికుల సామూహిక షెడ్ కు ఆమె శంకుస్థాపన చేశారు. తదుపరి నేత కార్మికులు మర యంత్రాలు ద్వారా వస్త్రాలను రూపొందిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆమె వస్త్రాల తయారీకి సంభందించిన పూర్తి వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఏర్పాటుచేసిన వస్త్ర ప్రదర్శనను తిలకించి, ప్రాంగణంలో మొక్కను నాటారు.
 
 అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను  దూరం చేసి, వారిని ఆర్ధికంగా ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసి వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపొందించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

జిల్లాలోని పొందూరు ఖాదీకి ప్రత్యేకత ఉందని, అయితే ఇక్కడ మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కాకపోవడానికి నేత కార్మికుల సంఖ్య తగ్గడమే అని చెప్పారు. కావున ఆ సంఖ్యను పెంచుకొని మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసుకోవాలని ఆమె కార్మికులకు పిలుపునిచ్చారు. తొలుత ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘానికి రూ.18 లక్షల చెక్కును ఆమె అందించారు. అలాగే భవన నిర్మాణానికి చెందిన ధ్రువీకరణ పత్రాలను ఆమె సంఘ ప్రతినిధులకు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జి.వి.ఎల్. నరసింహా రావు,ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్, దువ్వాడ శ్రీనివాస్,ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, వీవర్స్ సెల్ రాష్ట్ర సభ్యులు బండారు జై ప్రతాప్ కుమార్,కేంద్ర అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్,ఖాదీ గ్రామ పరిశ్రమ కమీషన్ ఆర్ధిక సలహాదారు ఆషిమా గుప్త,జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, ఎస్.పి అమిత్ బర్దార్,టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, ఖాదీ పరిశ్రమ సంచాలకులు ఎస్.రఘు, సౌత్ జోన్ డిప్యూటీ సి.ఇ. ఓ ఆర్.ఎస్.పాండే,బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి.కె.ప్రసాదరావు, కార్యదర్శి దండ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ రేగిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు