నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో విజయవాడ, విశాఖలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో సుప్రసిద్ధ దివ్యక్షేత్రమైన తిరుమలలో వెలసిన శ్రీవారికి వర్షాలతో కష్టాలు తప్పలేదు. తిరుపతిలో ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీవారి క్షేత్రం జలమయమైంది.
భారీ వర్షాల కారణంగా సోమవారం ఉదయం కల్యాణ సేవకు వచ్చిన భక్తులు ఆలయంలోకి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అద్దె గదులు దొరకని వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. తలదాచుకునేందుకు చోటు లేక వేలాది భక్తులు రేకుల కిందే ఉండిపోతున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గలేదు. వర్షంలో తడుస్తూనే శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.