జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు .. హీరో బాలకృష్ణ

మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (13:17 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అధికారం అడ్డుపెట్టుకుని సీఎం జగన్ చేస్తున్న కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. అవినీతి జరిగిందంటూ ఓ కట్టుకథ అల్లి చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని, సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని, పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని, హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? అంటూ ప్రశ్నించారు. 
 
అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్‌ అని అన్నారు. కక్ష సాధింపులే జగన్ లక్ష్యంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 
అనేక అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్... చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో పెట్టాలని కుట్ర పన్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారని, సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారన్నారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. మరి వారిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసిందని, 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని, జగన్... ఈ నాలుగున్నరేళ్ల కాలంలోఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, ఉన్న సంస్థలు విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారని మండిపడ్డారు. 
 
జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు.. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, పోలవరం ప్రాజెక్ట్ పడకేసిందని, రాజధాని ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. జగన్‌పై పీడీయాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు, 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడనీ, ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని, మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అని హెచ్చరించారు. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిదని, నేను మీ ముందుంటా.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దామంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు