ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం వ్యభిచారానికి అడ్డాగా మారిపోయింది. మధ్యవర్తులు హైటెక్ విధానంలో వ్యభిచారాన్ని గుట్టుచప్పుడు కానివ్వకుండా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా, వాట్సాప్ ద్వారా విటులకు అమ్మాయిల ఫోటోలను చేరవేస్తూ, గంటకు, రోజుకు వసూలు చేసే రేటును కూడా చేరవేస్తారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా చూసీ చూడనట్టుగా వదిలిపెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రం వ్యాప్తంగా సాగుతున్నాయి. వ్యాపార పనుల నిమిత్తం నగరానికి వచ్చే వ్యాపారులు హోటళ్లు, లాడ్జీల వద్ద బస చేస్తుంటారు. వాటి వద్ద బ్రోకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వారు సెల్‌ఫోన్‌లలో యువతుల చిత్రాలను చూపించి, రేటు చెప్పి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు ఎక్కువగా నడుపుతున్నట్లు తెలిసింది. సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో విలాసవంతమైన జీవితాలకు కొంతమంది బాగా ఖర్చు చేస్తుండటంతో.. వ్యభిచార గృహ నిర్వాహకులు దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. తమ వద్దకు వచ్చే విటుల ఫోన్ నంబర్లు తీసుకుని, యువతుల చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపిస్తూ రేటు నిర్ణయించకుంటున్నట్లు సమాచారం. గంటకు రూ.1000 నుంచి రూ.5,000 వరకు, ఒక్కరోజు యువతులను తీసుకుని వెళ్తే.. రూ.10 వేల రూ.30 వేల రూపాయల వరకు బ్రోకర్లు విటుల నుంచి వసూలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పక్క రాష్ట్రం నుంచి జిల్లాకు బతుకుదెరువు కోసం వచ్చిన కొంతమంది సులువుగా లక్షలు సంపాందించవచ్చని బ్రోకర్లుగా మారి ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి విటులకు ఎర వేస్తున్నట్లు సమాచారం.