ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల ముస్లిం మహిళలకు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధానాన్ని రూపుమాపేందుకు ప్రధానమంత్రి సారథ్యంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు శాయశక్తులా కృషిచేస్తోంది. ఇదిలావుంటే... ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ మొగుడు మాత్రం వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. పైగా.. నేను విడాకులు ఇస్తున్నా.. నీకు మంచి మొగుడు దొరకాలని ఆశిస్తున్నానంటూ దీవెనలు కూడా పంపాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
హైద్రాబాద్‌కు చెందిన బదర్ ఇబ్రహీం అనే యువతి ఎంబీఏ పట్టభద్రురాలు. ఈమెకు అహ్మద్ ఖాన్ అనే వ్యక్తితో రెండేళ్ళ క్రితం వివాహమైంది. ఖాన్ పెళ్లయిన 20 రోజుల తర్వాత సౌదీకి వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే సాఫ్ట్‌వేర్ అనలిస్టుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్త అహ్మద్ ఖాన్ నుంచి ఓ సందేశం వచ్చింది. అదే ట్రిపుల్ తలాక్ వీడియో. గత సంవత్సరం సెప్టెంబర్‌లో భార్యకు ట్రిపుల్ తలాక్ మెసేజ్ పంపించాడు.
"నేను విడాకులు ఇస్తున్నా.. నీకు మంచి మొగుడు దొరకాలని ఆశిస్తున్నా" అంటూ వాట్సాప్ సందేశంలో ఉంది. ఈ సందేశాన్ని విన్న బదర్ బోరున విలపించింది. ఆ తర్వాత అత్తామామల వద్దకు వెళ్లి కలిసింది. అక్కడ కూడా న్యాయం లభించలేదు. అయినప్పటికీ.. ధైర్యం కోల్పోకుండా తన భర్త ఎప్పటికైనా తన చెంతకు వస్తాడని ఇంతకాలం వేచిచూసింది. అయితే, ఇన్నాళ్లు వేచి చూసిన బదర్ ఇక లాభం లేదనుకుని నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వాట్సాప్ ట్రిపుల్ తలాక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.