నూరుశాతం స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ త‌థ్యం!

బుధవారం, 21 జులై 2021 (13:51 IST)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నూరు శాతం జ‌రిగి తీరుతుంది... దీనిపై ఇక చెప్పేదేమీ లేదు.... రాజ్యసభలో కేంద్రం జవాబు ఇదే! రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ క‌న‌క‌మేడ‌ల రవీంద్ర కుమార్  విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రశ్నవేశారు. దీనికి బదులిచ్చిన కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు స్టీల్ ప్లాంట్‌ని 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని ఉద్ఘాటించారు. దీనిపై మరో ఆలోచనకు తావులేదని స్పష్టీకరించారు.
 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించగా, కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని, నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చినందున, ఇకపై చెప్పేదేమీ లేదని కేంద్రం వైఖరిని కుండబద్దలు కొట్టారు. అయితే, ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, వాటాదారుల చట్టబద్ధమైన అంశాలను పరిష్కరిస్తామని భగవత్ కిషన్ రావు వెల్లడించారు.

ఈ విష‌యాన్ని కేంద్రం ఇంత స్ప‌ష్టంగా చెపుతుంటే, రాష్ట్ర బీజేపీ నేత‌లు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ జ‌ర‌గ‌దంటూ, రాజ‌కీయంగా క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పుకొస్తున్నారు. కేంద్రం చేసిన ఈ విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న‌తో ఇపుడు రాష్ట్ర నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు