పాకాలమండలంలోని దామలచెరువు పంచాయతీ మొరవపల్లెకు చెందిన రాజేంద్రనాయుడు, ఉషారాణిల కుమార్తె దీపిక. ఎంబీఏ వరకు చదువుకుంది. చిత్తూరు రాంనగర్ కాలనీలో నివాసముండే సుజాత, గోవిందస్వామి నాయుడుల కుమారుడు శ్యాంప్రసాద్‌కు ఇచ్చి 2017 ఆగష్టు 13వ తేదీన తిరుమలలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు.
కట్నం 2లక్షలు, అదనంగా మరో లక్షతో పాటు శ్యాంప్రసాద్‌కు బంగారు నగలు ఇచ్చారు. శ్యాంప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. దీపిక కూడా బెంగుళూరులోనే పనిచేస్తుండడంతో ఇద్దరూ పెళ్ళి తరువాత అక్కడే కాపురం పెట్టారు. వివాహమైన వారంరోజులకే భర్త శ్యాంప్రసాద్ సంసారానికి పనికిరాడని తెలుసుకుంది. అతని వద్ద కొన్ని రకాల మాత్రల ప్రిస్కిప్షన్ లభించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఆ ప్రిస్కిప్షన్‌ను వైద్యులకు చూపించింది. పుంసత్వం కోసం మందులు వాడుతారని తెలుసుకుంది. భర్తను గట్టిగా ప్రశ్నించింది.
అత్త,మామలను నిలదీసింది. నిజం ఒప్పుకోవడంతో నివ్వెరపోయింది. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని భర్తతో పాటు అత్త, మామలు ప్రాధేయపడ్డారు. దీంతో ఆ బాధను దిగమింగింది. అయితే తరచూ భర్త డబ్బులు కావాలని అదనపు కట్నం తీసుకురమ్మని హింసించే వాడు. ఇంట్లో ప్రశాంతత కరువవడంతో అసలు విషయాన్ని తన తల్లికి చెప్పింది.