కోర్టు ధిక్కరణ : కరీంనగర్ మాజీ కమిషనరుకు నెల రోజుల జైలు

బుధవారం, 5 జూన్ 2019 (14:28 IST)
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రభుత్వ అధికారులకు తగిన శాస్తి జరుగుతోంది. తాజాగా కోర్టు ధిక్కరణకు పాల్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థ మాజీ కమిషనరుకు 30 రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు హైదరాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే, రూ.25 వేల జరిమానా కూడా విధించింది. అయితే దీనిపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ ఏ.రాజశేఖర్ తీర్పును ఇచ్చారు.
 
1980లలో కరీంనగర్ నగర పాలక సంస్థ నుంచి అనుమతి తీసుకొని కొంతమంది నివాస భవనాలు, షాపులు నిర్మించుకున్నారు. ఆ తర్వాత నగర విస్తరణలో భాగంగా వారికి నోటీసులు ఇవ్వకుండానే నివాస భవనాలను, షాపులను అధికారులు కూల్చివేశారు. దీనిపై కేసు వేస్తూ ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై గతంలో స్టే ఆదేశాలను ఇచ్చిన హైకోర్టు, ఆపై విచారించి, పిటషనర్ కోల్పోయిన 13 షాపులను తిరిగి కేటాయించాలని లేదా నిబంధనల ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని 2015 జనవరిలో ఆదేశాలను ఇచ్చింది. 
 
కానీ కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి కార్పోరేషన్ అధికారుల తీరుని తప్పుబడుతూ అప్పటి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్‌కు శిక్ష ఖరారు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు