ప్లీజ్.. మా ఇంటికి రావొద్దు.. ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు.. గేట్లకు తాళం

ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:26 IST)
ఇటీవల దారుణ అత్యాచారం, హత్యకు గురైన పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికీ ఓ విజ్ఞప్తి చేశారు. దయచేసి మా ఇంటికి ఎవరూ రావొద్దంటూ ప్రాధేయపడ్డారు. ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు నివశించే కాలనీవాసులు కాలనీకి గేట్లు వేసి ఆందోళనకు దిగారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నక్షత్ర విల్లా వద్ద కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ కాలనీలోనే ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. 
 
కాలనీ గేటుకు లోపలి నుంచి తాళాలు వేసిన కాలనీ వాసులు తమ ప్రాంతానికి పోలీసులు, రాజకీయ నాయకులు రావద్దని బోర్డులు పెట్టేశారు. అలాగే, తమ కాలనీలో ఉన్న పోలీసులను బయటకు పంపేశారు. గేటు వద్దే బైఠాయించి స్థానికులను మాత్రమే లోపలికి పంపుతున్నారు. 
 
కాలనీ వాసుల డిమాండ్‌తో అక్కడ ఉన్న పోలీసులు, కొందరు నాయకులు వెనక్కి వెళ్లిపోయారు. కొందరు సీపీఎం నేతలు ఆదివారం ఉదయం అక్కడకు వచ్చి, స్థానికులతో పాటే కూర్చొని నిరసనలో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి సానుభూతి వద్దని, వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు