ప్రియాంక రెడ్డి హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయనీ, ఈ దారుణ ఘటనపై వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులకు ఉరి శిక్ష పడేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు సానె పెట్టబోతున్నామని.. త్వరలోనే చట్టాలను మార్చబోతున్నామని తెలిపారు.
ఇదే విషయంపై లోక్‌సభలో చర్చించనున్నట్లు తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీలో ఎలాంటి సవరణలు చేయాలో సలహాలు కోరుతామని.. ఫోక్సో చట్టం వల్ల నిందితులకు సత్వరమే శిక్షలు పడుతున్నాయని చెప్పారు. ప్రియాంక రెడ్డి విషయంలో పోలీసులు సరిహద్దుల విషయంలో తాత్సారం చేయడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చట్టాలను మార్చబోతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి.
ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత అంతటి ఘోరమైన హేయమైన ఘటన శంషాబాద్‌లో జరిగిందన్నారు. నిందితులకు త్వరగా శిక్షలు పడేందుకు రాష్ట్ర పోలీసులకు సహకారం అందిస్తామని తెలిపారు. 112 యాప్‌ను తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించే విషయమై డీజీపీతో మాట్లాడానని తెలిపారు. గుజరాత్‌లో రాత్రి వేళలో సైతం మహిళలు ఒంటరిగా తిరుగుతారు. ఆ పరిస్థితి దేశ వ్యాప్తంగా రావాలన్నారు. అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.