తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బండ్లగూడ నూరీ నగర్‌కు చెందిన ఫజల్ రహమాని (25) అనే వ్యక్తికి ఇష్రత్ ఫర్వీన్ అనే యువతితో 2016లో వివాహమైంది. ఈ దంపతులకు తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. రెండో కాన్పులో అయినా మగబిడ్డ పుడతాడని భావించారు.
అయితే, నాలుగు నెలల క్రితం ఫర్వీన్ రెండోసారి కూడా ఆడబిడ్డకే జన్మనిచ్చింది. కొడుకు పుడతాడని గంపెడు ఆశలు పెట్టుకున్న ఫజల్‌కు ఆడపిల్ల పుట్టిందని తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధించసాగాడు. ఈ వేధింపులు తట్టుకుని కూడా ఫర్వీన్ భర్తతో సంసారం చేస్తూ వచ్చింది. కానీ, అత్తమామల వేధింపులు ఎక్కువకావడంతో వాటిని భరించలేక ఫర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫజల్ తన తల్లిదండ్రులను తీసుకుని మరో చోట నివసిస్తున్నాడు.
భర్త, అత్తమామలు మరో ఇంటికి వెళ్లిన తర్వాత ఫర్వీన్ మాత్రం ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటూ తన తల్లి, చెల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం సర్ఫరాజ్, అమ్దాద్ ఖాన్‌తోపాటు మరో వ్యక్తి ఫర్వీన్ ఇంట్లోకి చొరబడి బలవంతంగా వారిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఫర్వీన్, ఆమె పిల్లలను రహమాన్ తమకు రూ.3 లక్షలకు అమ్మేశాడని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించగా వారంతా బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు. ఆ తర్వాత విచారణ జరిపి వారిని వదిలివేశారు. ఈ వ్యవహారంపై ఫర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో బాధిత మహిళ... మహిళా సంఘాలను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.