రెండు చోట్ల ఓడించిన మనమా.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది : హైపర్ ఆది

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (23:26 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కొందరు జనసేన పార్టీ నేతలతో పాటు కాపు నేతలు చేస్తున్న విమర్శలపై కమెడియన్, జనసేన కార్యకర్త హైపర్ ఆది స్పందించారు. విమర్శలు చేసే వారికి తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్‌‍ను ఓడించిన మనమా.. ఆయన గురించి మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. పవన్ అమ్ముడుపోయే వ్యక్తి కాదని అన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి అని గుర్తుచేశాడు. 
 
కేవలం 24 సీట్లకే తలొగ్గడం ఏమిటని పవన్ గురించి మాట్లాడుతున్నారని... 2019లో ఆయనను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్ ఆది సూటిగా నిలదీశాడు. సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని కొనియాడాడు. రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసకునే పవన్... సంపాదన మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు పెట్టేసి... ఇప్పుడు దాదాపుగా అప్పు చేసి పార్టీని నడుపుతున్నారనే విషయం ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. 
 
చిన్న పరీక్షలో ఫెయిల్ అయతేనే మనం పది రోజులు బయటకు రాలేమని... అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్‌దని కొనియాడాడు. కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని... ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికారంలో ఉన్న వైసీపీ వద్ద ఎక్కువ డబ్బు ఉందని... అలాంటప్పుడు వైసీపీ దగ్గరకు పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించాడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం... అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని అన్నాడు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానం అంటారని చెప్పారు. మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదని హితవు పలికాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు