శృంగారానికి దూరంగా ఉంటా.. సింగారానికి దగ్గర ఉంటా : ఆనం వివేకా

సోమవారం, 25 జులై 2016 (08:36 IST)
నెల్లూరు సోగ్గాడిగా పేరుగాంచిన టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి తన మనసులోని మాటలను వెల్లడించారు. తాను శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి చూపనని, కానీ, సింగారాలు (సోకులు చేసుకోవడం) చేసుకుంటానని చెప్పారు. 
 
నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తమ జిల్లాలో ఎంత మంది నాయకుల్లో శృంగార పురుషులు ఉన్నారో తనకైతే తెలియదని, తాను మాత్రం శృంగార పురుషుడిని కాదని తేల్చి చెప్పారు. తనకు మిగిలిపోయిన కొన్ని కోరికలు ఉన్నాయని... ఆ కోరికలేమిటంటే జనంతో ఉండటం, వారితో తన జీవితం కొనసాగించడమేనని, ‘ఇట్స్ మై లాస్ట్ డిజైర్’ అని అన్నారు. 
 
నెల్లూరులో ఉంటే తాను రోజూ సినిమాకు వెళతానని, అయితే, ఒక్కడినే వెళతానని, తనతో పాటు నలుగురిని తీసుకువెళితే సినిమా చూడానివ్వకుండా ఏవో కబుర్లు చెబుతుంటారని, అందుకే, ఒక్కడినే వెళతానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆనం జవాబిచ్చారు. తాను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా.. లేకపోయినా.. నిత్యం ప్రజలతో కలిసివుండేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి