జడ్జీల నియామకంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు: జస్టిస్ ఎన్వీ రమణ

శనివారం, 20 ఆగస్టు 2022 (15:16 IST)
తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో దేశ వ్యాప్తంగా 250కి పైగా జడ్జీలను నియమించినట్టు భారత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన సిటీ సివిల్ కోర్టు భవన సముదాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సుప్రీం చీఫ్ జస్టీస్‌గా ఉన్న ఒక యేడాది నాలుగు నెలల కాలంలో 250 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జీలను, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు గుర్తుచేశారు. పైగా, జడ్జీల నియామకంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్ చెప్పారని,  ఆయన సకాలంలో నిధులు విడుదల చేయడం వల్లే న్యాయస్థానాల భవన సముదాయం త్వరితగతిన పూర్తయిందని చెప్పారు. విశాఖపట్టణంలో కూడా చిన్న సమస్య ఉందని, అక్కడ కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సీఎం జగన్ సహకరించాలని ఎన్వీ రమణ కోరారు. 
 
ఇకపోతే, చాలా మంది గొప్ప మనసుతో నన్ను ఆదరించి పైకి తీసుకొచ్చారు. ఈ నెల 27వ తేదీన పదవీ విరమణ చేయనున్నాను. నా ఉన్నతికి, విజయానికి కారణమైన న్యాయవాదులకు, జడ్జీలకు, నా అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా ఎదుగుదలకు మీరే కారణం" అని చీఫ్ జస్టిస్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు