మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి మళ్లీ కీలక పోస్టింగ్... ఏపీ సర్కారు ఆదేశం

వరుణ్

శుక్రవారం, 28 జూన్ 2024 (09:56 IST)
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అధికార పార్టీ నేతలు చేసిన ఎన్నో అక్రమాలకు అండగా నిలిచిన నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇపుడు మాజీ కార్యదర్శి అయిన జవహర్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్లీ కీలక పోస్టింగ్ ఇచ్చింది. అలాగే, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్యకు కూడా ఎన్డీయే సర్కారు పోస్టింగ్ ఇచ్చింది. ఈ రెండు పోస్టింగులు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అధికార వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు త్వరలోనే పదవీ విమరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు పోస్టింగులు ఇచ్చినట్టు తెలుస్తుంది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
మరోవైపు, నిరీక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా  భాస్కర్‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య అప్పటి సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు.
 
ఇదిలావుంటే, ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్‌కు సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను ఏపీ కేడర్‌కు తీసుకొచ్చారు. ఆయనకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు. ఆయనను రిలీవ్ చేయాలని ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు