ఆమె గెలిస్తే వచ్చే రెండేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు భయపడి పాలన సాగిస్తారు, ఎవరు?

సోమవారం, 22 మార్చి 2021 (21:29 IST)
శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... పనబాక లక్ష్మి గెలిస్తే వచ్చే రెండేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు భయపడి పాలన సాగిస్తారని అన్నారు. 
 
వైసీపీ రెండేళ్ల పాలనలో నష్టం తప్ప ప్రజలకు జరిగిన లాభం లేదనీ, కొత్త పరిశ్రమ ఒక్కటి రాకపోగా ఉన్నవి వెనక్కిపోతున్నాయన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పైపుల ఫ్యాక్టరీని స్థానిక ఎమ్మెల్యే బలవంతంగా మూసివేయిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? 
 
ఈ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. వృద్ధిరేటు పడిపోయింది. ఇసుక నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు వస్తే ప్రజలకు అవి చేస్తాం.. ఇవి చేస్తామని హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతారు. వైసీసీ పాలనలో మాత్రం పథకాలు పీకేస్తామని బెదిరిస్తున్నారు.
 
గిరిజనులు, దళితులు, నిరుపేదలను పథకాలు రద్దు చేస్తామని బెదిరించి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోం... అందరం అక్కడకు చేరుకుని తాడోపేడో తేల్చుకుంటాం.
 
వలంటీర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆటలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో సాగవు. 
ఇవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికలు కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికలు. ప్రతి ఓటరూ తమ ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు