రాజకీయ బఫూన్లు... మోదికి జోడెద్దులు జగన్ - పవన్

సోమవారం, 23 జులై 2018 (21:19 IST)
అమరావతి : జగన్, పవన్ రాజకీయ బఫూన్లని, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ముఖ్యమని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదికి వారిద్దరూ జోడెద్దులుగా ఉన్నారన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తానంటూ టీడీపీ మోసం చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ కాదనడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లానన్నారు. ఆయనేమి అన్నారో చెప్పాలని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పవన్‌ది రాజ్యసభ సీటు కోసం అమ్ముడుపోయే వ్యక్తిత్వమా అని ప్రశ్నించారు. 
 
2014లో పోటీ చేస్తే 60, 70 మంది ఎమ్మెల్యేలను గెలుపించుకునే వాడినని పవన్ అన్నారన్నారు. ఆనాడు పవన్ పార్టీ ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ జరిగిందా అని ప్రశ్నించారు. ఏడాదికి 120 పంటలు పండిన భూములు రాజధాని నిర్మాణానికి లాక్కుకున్నామని పవన్ అనడం ఆయనకున్న రాజకీయ అవగాహనలేమిని తెలియజేస్తోందన్నారు. ఏ భూమిలోనైనా ఏడాదికి రెండుమూడు పంటలే పండుతాయన్నారు. పొగాకు, వరి 6 నెలలు, జొన్న, సజ్జలు 3 నెలలకు పంటలు చేతికొస్తాయన్నారు. వ్యవసాయం ఎటువంటి అవగాహనా లేని పవన్ నోటికిచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. 
 
వైఎస్ఆర్ సిపి, బీజేపీ నేతలు కూడా రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారన్నారు. గుజరాత్‌లో డోలా నగరాన్ని 2,50,000 ఎకరాల్లో అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. అన్ని వేల ఎకరాలు ఎందుకని ఏనాడయినా జగన్ గాని, పవన్ గాని ప్రశ్నించారా..?అని చైర్మన్ జూపూడి నిలదీశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 34 వేలు ఎకరాలు సేకరించామని, రాజధాని ప్రాంతాన్ని 8 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. మిగిలిన భూములను పారిశ్రామికాభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. జగన్ తన ఇంటిని రెండు ఎకరాల్లో నిర్మించారన్నారు. ఇంతపెద్ద ఇల్లు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోది కళ్లల్లోకి చూసి మాట్లాడే దమ్ము జగన్‌కు ఉందా... అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు