వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష హోదాలో వున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అభ్యంతరకర భాషను ఉపయోగించడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై సీరియస్ అయ్యారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని పెద్ద వడుగూరులో ఐదో విడత రైతు భరోసా యాత్రలో జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వడుగూరులో జగన్ మీడియాతో మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞను ప్రస్తావించారు. చంద్రబాబును ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుతో కొట్టాలని, చెప్పుతో కొడితే తప్ప ఆయనకు బుద్ధి రాదని కూడా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అనుకుంటే తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే ప్రజల చేత చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమేయగలనని తెలిపారు. ప్రజల చేత చెప్పులతో కొట్టేస్తే ఏం చేస్తావు జగన్ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడి గారిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని జేసీ ఫైర్ అయ్యారు.