గవర్నర్‌ తో జగన్‌ భేటీ

గురువారం, 2 జనవరి 2020 (19:29 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం జగన్‌ గవర్నర్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు రాజధానుల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.

గవర్నర్‌ దంపతులకు మొదటగా సీఎం దంపతులు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై గత కొంతకాలంగా ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాజధాని మార్పుపై గవర్నర్‌కు ప్రభుత్వం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల ఏర్పాటుపై గవర్నర్‌కు జగన్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కాగా.. గవర్నర్‌ను మర్యాద పూర్వకంగానే సీఎం కలిశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్‌ను కలిశారు. రాయలసీమలో హైకోర్టు, రాజధాని మార్పు చర్చించారు.

అంతేకాకుండా రాజధాని రైతులు కూడా గవర్నర్‌ను కలిశారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపడం ద్వారా తమను ఆదుకోవాలని రైతులు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కోరారు.

సుమారు 40మంది రైతు ప్రతినిధులు కలిసి, తమ గోడును విన్నవించుకున్నారు. ఈ పరిణాల నేపథ్యంలో జగన్‌, గవర్నర్‌ను కలవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు