జగన్ చేతకాని వాడు.. దద్దమ్మ, మూర్ఖుడు: చంద్రబాబు

బుధవారం, 1 జనవరి 2020 (15:52 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టాడని, ఇప్పుడు మాత్రం తన నిర్ణయాలతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని  విమర్శించారు.

అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న దీక్షలకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇక్కడే రాజధాని ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని తాను విమర్శిస్తే ఆయన పట్టించుకునేవారని, తనను చూస్తే ఆయన గౌరవించేవారని అన్నారు.

కానీ, జగన్ మాత్రం అలా చేయడం లేదని, సూచనలను పట్టించుకోవట్లేదని అన్నారు. రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల కల అమరావతి అని చంద్రబాబు అన్నారు.
 
జీఎన్రావు ఆకాశం నుంచి ఊడిపడ్డారా..?'
రాజధాని కోసం నియమించిన జీఎన్ రావు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. జీఎన్ రావు అంటే ఎవరో అనుకున్నానని.. అతనికి కనీసం రాజధానిపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

జీఎన్రావు కమిటీ అంటే ఏంటో అనుకున్నానని.. ఇంతకు మునుపు అతను రాజధాని ప్రాంతం మునిగిపోతుందని చెప్పిన ఓ అవగాహన లేని కలెక్టర్ అని చంద్రబాబు చెప్పారు. ఆనాడే అతన్ని నేను మందలించానని.. అతనేదో ఆకాశం నుంచి ఊడి పడినట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పిందని ఎద్దేవా చేశారు.

అనంతరం.. కేసులతో ఉన్న బోస్టన్ కంపెనీకి రాజధానిని చూసే బాధ్యతలు అప్పగించారని.. ఇప్పుడు హైపవర్ కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో భూముల ధరలు పెరిగితే ముఖ్యమంత్రికి ఇబ్బందేంటని ప్రశ్నించారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు అసలైన ద్రోహి వైఎస్ జగనే అని విరుచుకుపడ్డారు. కృష్ణాయపాలెంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘జగన్ చేతకాని వాడు.. దద్దమ్మ.. దిగిపో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సచివాలయానికి రావడానికి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

తాను కట్టిన భవనాల్లో కూర్చుని పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏం కట్టాడు? అని ప్రశ్నించారు. రాజధానిని మార్చే అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో జగన్.. తుగ్లక్‌ను మించిపోయారని విమర్శించారు.
 
విభజనతో నష్టపోయిన ఏపీలో హైదరాబాద్‌ను మించిన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతోనే అమరావతికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రజల కలల రాజధానిని నిర్మించాలని భావించడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జగన్ వచ్చిన నాటి నుంచి అమరావతిలో పనులన్నీ నిలిపివేశారని ఆరోపించారు.

అమరావతిని తరలిస్తే మరణమే శరణ్యం అంటూ రాష్ట్రపతికి 29 గ్రామాల ప్రజలు లేఖలు రాశారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ ఎంతమందిని బలితీసుకుంటారని ధ్వజమెత్తారు. పరిపాలనలో జగన్‌కు ఓనమాలు కూడా రావని విమర్శలు గుప్పించారు. వైఎస్ అయినా తనను గౌరవించేవాడు కానీ, జగన్ ఓ మూర్ఖుడు అంటూ చండ్ర నిప్పులు కక్కారు.

అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువని, ఒకే సామాజికవర్గం అంటూ అసత్యాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ముంపు, ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఇల్లు కొనుక్కుంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ అవుతుందా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ‘నన్ను పట్టుకునేందుకు కొండను తవ్వాడు.. ఎలుక కాదు కాదా.. ఎలుక బొచ్చు కూడా దొరకలేదు’ అని చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని కోసం పోరాడుతున్న ఆరుగురు రైతులపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే ఆయనను కూడా అడ్డుకున్నారని ఇదే అరాచక పాలన అని ప్రభుత్వం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు