జగన్... నీ పాదయాత్ర ఆపకు... కాశీ వరకూ పాదయాత్ర చేసుకో.. ఎవరు?
సోమవారం, 8 అక్టోబరు 2018 (20:58 IST)
అమరావతి : 2019 ఎన్నికల్లో టీడీపీదే విజయమని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను కాశీ వరకూ కొనసాగించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులు దేవుళ్లని, వాళ్లను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 6 నెలల్లోగా కొత్త ఇళ్లల్లో వారితో గృహ ప్రవేశం చేయిస్తామని స్పష్టం చేశారు. 2019 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరిందిస్తామన్నారు.
సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 59.01 శాతం పూర్తయ్యిందన్నారు. వచ్చే నెలలో గేట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై 77 వర్చువల్ ఇన్ స్పెక్షన్ సోమవారం జరిగిందన్నారు. పోలవరం పనుల ప్రగతిని మంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు వివరించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారన్నారు. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది నేటి వరకూ 63 టీఎంసీల కృష్ణా డెల్టాకు అందించామన్నారు. నాలుగేళ్లలో 227 టీఎంసీలను అందించామన్నారు. ఇది ఒక చరిత్ర అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు.
పట్టిసీమ శుద్ధ దండగ అని జగన్ అన్నారని, ఇప్పుడేమి చెబుతారని ప్రశ్నించారు. జగన్ తన చెవిలో దూదిపెట్టుకున్నా, సీసం పోసుకున్నా తమకు చెప్పాల్సిన ఉందని, అందుకే ప్రతి వారం లెక్కలు చెబుతున్నామని అన్నారు. బీజేపీ డైరెక్షన్ లో ఎన్ని కుట్రలు చేసినా, కోర్టులో ఎన్ని కేసులు వేసినా పోలవరం ప్రాజెక్టును అనుకున్న లక్ష్యంలోగాపూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టును నేటి వరకూ 1,36,378 మంది రైతుల తిలకించారని మంత్రి తెలిపారు. కళ్లున్నా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి జగన్‌ది అని విమర్శించారు. తన సొంత పత్రిక, చానల్ లెక్కలు చూడడానికి సమయం కేటాయిస్తున్న జగన్, ప్రాజెక్టు పరిశీలనకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. పులివెందులకు నీరిచ్చినా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి ప్రతిపక్ష నేతది అని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పులివెందులకు నీరివ్వడంపై ఆ ప్రాంత వాసులు సీఎం చంద్రబాబునాయుడుకు జేజేలు పలుకుతున్నారన్నారు. కనీసం జగన్‌కు కృతజ్ఞత చెప్పే ఉద్దేశం కూడా లేదన్నారు.
లేచిన్పప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడును, లోకేష్‌ను, టీడీపీ నాయకులను నిందించడంతోనే ప్రతిపక్ష నేతకు సమయం సరిపోతుందన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న దసరాకు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద మిగిలిన రూ.2 వేలు అందజేయనున్నామన్నారు. 14 రకాల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1000 కోట్ల వరకూ బాధితులకు అందజేస్తామన్నారు.
బీజేపీతో కలిసి అభివృద్ధిని అడ్డుకోడానికి జగన్ కుట్ర
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్ర్రప్రదేశ్ లో 20 వేల కిలో మీటర్లలో సిమ్మెంట్ రోడ్లు నిర్మించామని మంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు తెలిపారు. గుజరాత్, రాజస్తాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఇంత భారీగా సీసీ రోడ్లు నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయం బీజేపీ నేతలు జీవీఎల్ నర్సింహారావు, కన్నా లక్ష్మీనారాయణలతో మాట్లాడి తెలుసుకోవాలని జగన్ కు సూచించారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏపీకి తరలొస్తున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న అమరావతిని భ్రమరావతి అని జగన్ అనడం సరికాదన్నారు. ఆయన ఏనాడయినా అభివృద్ధి పనులకు వచ్చారా అని మంత్రి దేవినేని ఉమమహేశ్వరావు ప్రశ్నించారు. శరవేగంగా అభివృద్ధిని చూడలేకే, అమరావతి రాజధాని పనులు అడ్డుకోవాలని బీజేపీ నేతలతో కలిసి ప్రతిపక్ష నేత కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.
కాశీ పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించు...
రాష్ట్రానికి రావాల్సిన వోక్సో వాగన్ కంపెనీని పూనేకు తరలించిన ఘనత బొత్స సత్యనారాయణది అని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ధర్మాన, బొత్స వంటి నేతలు మంత్రులుగా ఉండి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఏ మేలు చేశారని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు తన పార్టీ తరఫున జగన్ డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీదే విజయమని, జగన్ తన పాదయాత్రను కాశీ వరకూ కొనసాగించాలని, వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని ఎద్దేవా చేశారు.
ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వ్యాక్ నిర్వహిస్తే, పిక్నిక్ వాక్ చేశారని జగన్ విమర్శించడం దారుణమన్నారు. భవనాలు పడిపోతున్నాయని, కారిపోతున్నాయని ప్రచారం చేయడం సరికాదన్నారు. జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్షనేతగా ఉండడం దౌర్భాగ్యమన్నారు. రాబోయే కాలంలో జగన్ లాంటి నేతలపై మాట్లాడడం తగ్గించేస్తానని మంత్రి దేవినేని ఉమమాహేశ్వరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అదనంగా రూ.3,339 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచాలని కోరుతున్నా, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
పగటి కలలు కనకు...
2019 ఎన్నికల్లో 21 పార్లమెంట్ స్థానాలు వైసీపీ గెలుస్తందంటూ తనకు అనుకూలమైన సంస్థలతో జగన్ సర్వే చేయించుకున్నారని మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు విమర్శించారు. సర్వేలతో ప్రతిపక్ష కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. ఉత్తరకుమారుడి ప్రగల్భాలు మానుకోవాలన్నారు. 2014 ఎన్నికల ముందు ఇలాగే పగటి కలలు కన్నారని అన్నారు.