భారతీ సిమెంట్స్ కేసులో 19 మంది నిందితులుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని ఈడీ ఐదో నిందితురాలిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తన గ్రూప్ కంపెనీల నుంచి వైఎస్ జగన్ డైరెక్టరుగా వైదొలగిన తరువాత జగన్ సతీమణి భారతి కీలక పాత్రను పోషిస్తున్నారని ఈడీ తన ఛార్జీషీట్‌లో పేర్కొంది.
భారతీకి సాలీనా రూ. 3.90 కోట్ల వేతనం అందుతోందని, సంస్థలోని మెజారిటీ షేర్ హోల్డర్లకు కూడా అంత వేతనం లేదని, మనీ లాండరింగ్‌లో ఆమె శిక్షార్హురాలని తెలిపింది. గతంలో మూడు సార్లు తాము సమన్లు పంపినా, ఆమె విచారణకు రాలేదని కూడా ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీల్లో నిధుల బదిలీ, ఆడిట్ బ్యాలెన్స్ షీట్లపై ఆమె సంతకం చేస్తున్నట్టు కూడా ఈడీ తెలిపింది. జగన్, భారతిల అంగీకారంతోనే భారతి సిమెంట్స్, సండూర్ పవర్, సిలికాన్ బిల్డర్స్, సరస్వతి పవర్, క్యాప్ స్టోన్ ఇన్ ఫ్రా తదితర కంపెనీల్లో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తెలిపింది.
భారతీ సిమెంట్స్‌లో 51 శాతం వాటా ఉన్న పర్ఫిసిమ్ డైరెక్టర్ల కన్నా భారతికి అధిక వేతనం వస్తోందని.. గత ఐదేళ్లలో ఆమె రూ. 19.50 కోట్ల వేతనాన్ని అందుకున్నారని, మెజారిటీ వాటాలున్న డైరెక్టర్లకు అందులో సగం మొత్తమే వేతనంగా లభించిందని ఈడీ వెల్లడించింది.
మరోవైపు భారతీ పేరును ఈఢీ ఛార్జీషీటులో చేర్చడంపై వైకాపా చీఫ్ జగన్ మండిపడ్డారు. ఇందులో కుట్ర వుందని వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ అధికార పార్టీ నేతలు జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి ఆస్తులను భార్య పేరిట పెట్టి జగన్ తప్పు చేస్తే, ఆ తప్పును సమర్థించిన భారతి శిక్షార్హురాలేనని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.
జగన్ తన అవినీతికి భార్యను బాధ్యురాలిని చేశారని ఆరోపించిన ఆయన, జగన్ అవినీతి కేసుల్లోనే ఐఏఎస్ అధికారిణులు రత్నప్రభ, శ్రీలక్ష్మి జైలుకు వెళ్లి వచ్చారని గుర్తు చేశారు. వారు జైలుకు వెళ్లినప్పుడు లేఖలు రాయని జగన్, ఇప్పుడు తన భార్య పేరు వచ్చేసరికి సానుభూతి పొందాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు.
రత్నప్రభ, శ్రీలక్ష్మి, అప్పటి హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... వీరంతా మహిళలేనని, వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇలా బహిరంగ లేఖలు ఎందుకు రాయలేదని వెంకట్రావు ప్రశ్నించారు. చేసిన తప్పులకు పశ్చాత్తాప పడి, అవినీతి డబ్బును ప్రభుత్వపరం చేసి, కేసులు లేకుండా చూసుకోవాలని జగన్‌కు వెంకట్రావు సలహా ఇచ్చారు.