టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన రాష్ట్రానికి చెందిన పీవీ సింధు సహా వివిధ అంతర్జాతీయ, జాతీయ క్రీడా వేదికలపై పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు.
పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణకోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్ వెళ్లేముందు సింధుతోపాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం కూడా చేశారు.
2017–22 స్పోర్ట్స్‌పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారుపతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్యపతకం సాధించిన వారికి రూ.30 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.