మరికొద్ది సేపట్లో అంతర్వేదికి జగన్

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:39 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అంతర్వేది పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

11.30 నుంచి 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

11.45 నుంచి 11.50 గంటల వరకూ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 11.50 గంటలకు వేద పండితుల నుంచి ఆశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం స్వీకరిస్తారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని సందర్శించి ప్రారంభిస్తారు.

12.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లి వెళ్లనున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న స్వామి కల్యాణోత్సవాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర జి.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. పెట్రోలింగ్‌కు నాలుగు ఇంజిన్‌ బోట్లు సిద్ధం చేయాలని ఫిషరీస్‌ జేడీ పీవీ సత్యనారాయణకు ఎస్పీ సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళ్లే మార్గంలోని ప్రధాన కూడళ్లలో కచ్చితంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రత్యేక భద్రతా సిబ్బంది కోరారు.

ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గం, రథం వద్ద కార్యక్రమాలపై కూడా దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులతో ఎస్పీ, జేసీ సమీక్షించారు. తుది దశకు చేరుకున్న ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు