ప్యారడైజ్ పేపర్ల కథనాలపై జగన్ సమాధానం చెప్పాల్సిందే... మంత్రి కళావెంకట్రావు
మంగళవారం, 7 నవంబరు 2017 (22:09 IST)
అమరావతి: ప్యారడైజ్ పేపర్లలో జగన్ పైన వచ్చిన కథనాలపై తక్షణమే ఆయన వివరణ ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళావెంకట్రావు నిలదీశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీకి ఏపీ జెన్ కో, ట్రాన్ కో విరాళంగా ఇచ్చిన రూ.61.43 లక్షల చెక్ ను సొసైటీ ప్రతినిధులకు మంత్రి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్యారడైజ్ పేపర్లలో జగన్ పాత్ర ఉందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉన్న జగన్, వారి సమక్షంలోనే ప్యారడైజ్ పేపర్లలో వచ్చిన కథనాలపై వివరణ ఇవ్వాలని మంత్రి నిలదీశారు. జగన్ అవినీతి రాష్ట్ర సరిహద్దులు దాటి, ప్రపంచ పటంలో చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు.
పాదయాత్ర చేస్తే సిఎం అయిపోతాననే భ్రమలో జగన్ ఉన్నారన్నారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారనుకుంటే, అందరూ అదే పని చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పేరుతో తన ఎంపీలతో గత జూన్ లో రాజీనామా చేస్తానని జగన్ ప్రకటించారన్నారు. ఇప్పటి వరకూ రాజీనామాల గురించి ఆయన మాట్లాడడం లేదన్నారు. తన ఎంపీల చేత ఎప్పుడు రాజీనామా చేయిస్తారని మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రజాజీవితంలో కొనసాగాలనే వ్యక్తి నైతిక విలువలతో కూడిన జీవనం కలిగి ఉండాలన్నారు.
అసెంబ్లీని వైకాపా బహిష్కరించడంతో, సభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చకు అవకాశం కలిగిందన్నారు. ప్రతిపక్షం ఉన్నా...లేకున్నా నిబంధనల ప్రకారం సభ నిర్వహణ కొనసాగుతుందని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు.
రెడ్‌క్రాస్‌కు ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో విరాళం... రూ.61.43 లక్షల చెక్
అమరావతి: సామాజిక సేవలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీకి ఏపీ ట్రాన్స్‌కో, జెన్ కో విద్యుత్ సంస్థలు రూ.61.43 లక్షలు విరాళాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి కళా వెంకట్రావు చేతుల మీదుగా అందజేశాయి. సచివాలయంలోని తన కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఎస్.సుబ్రహ్మణ్యానికి మంత్రి కళావెంకట్రావు రూ.61.43 లక్షల చెక్‌ను మంగళవారం అందజేశారు. ఈ మొత్తాన్ని విజయవాడలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకు ఆధునీకరణకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి.ఎస్.ఆర్) కింద ఏపి ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో రూ.30,71,500 చొప్పున మొత్తం రూ. 61,43,000 విరాళంగా అందజేశాయన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న బ్లండ్ బ్యాంకులో ప్రస్తుతం ఉన్న పాత పరికరాల స్థానంలో నూతన పరికరాల ఏర్పాటుతో పాటు బ్లడ్ బ్యాంకు ఆధునీకరణ చేపట్టాలని రెడ్ క్రాస్ ప్రతినిధులు భావించారన్నారు. ఇందుకోసం రూ.61.43 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారన్నారు.
సి.ఎస్.ఆర్ కింద నిధులు మంజూరు చేయాలని ఏపీ ఇండియన్ క్రాస్ సొసైటీ చేసిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ చట్టప్రకారం ఏపి ట్రాన్స్ కో ,ఏపి జెన్ కో రూ.61.43 లక్షలను సామాజిక సేవలో భాగంగా విరాళ రూపంలో అందజేసినట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. మంత్రి కళా వెంకట్రావుకు, ఇంధన, మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు, సీఆర్డీచఏ శాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఏపీ జెన్ కో ఎం.డి కె. విజయానంద్, ఇందన శాఖ సలహాదారు కె. రంగనాథం, ఏపీ ట్రాన్స్ కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతికి రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఎస్.బాలసుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు ఎ.శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ట్రజరీ జీవైఎన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.