పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇఛ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్నిపెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుకగా అందజేసేందుకు సిద్ధమయ్యింది. పెంచిన పెళ్లి కానుకను శ్రీరామ నవమి నుంచి అమలు చేయనుంది. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద అందజేశారు. పెంచిన ప్రోత్సాహకం ప్రకారం వైఎస్సార్ పెళ్లి కానుక కింద వారందరికీ లక్ష రూపాయలు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను ఇప్పుడు రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు, కులాంతర వివాహాలు చేసుకొనేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు, దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రోత్సాహకాలను పెంచారు.
భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను కూడా జగన్ సర్కార్ పెంచింది. రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారింట్లో ఆడపడుచులకు పెళ్లి కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికు కుటంబాలకు సాయం చేస్తుండగా, ఆ విషయం వారికి అవగాహన లోపంతో సాయానికి దూరమవుతున్నారు.
భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 52 జంటలు మాత్రమే పెళ్లి కానుక దరఖాస్తు చేసుకున్నాయట. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. గుర్తింపు కార్డు వచ్చిన వారు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.