సర్.. మీరే నాకు నాయకుడు.. మీతోనే ఉంటా : జనసేన ఎమ్మెల్యే రాపాక

శుక్రవారం, 7 జూన్ 2019 (17:51 IST)
ముగిసిన ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమిపాలైనప్పటికీ.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
 
ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత జగన్‌ను ఎమ్మెల్యే రాపాక శుక్రవారం కలిశారు. పడమట లంకలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన రాపాక ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించుకున్నారు. 
 
ఆ తర్వాత ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ, తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని, వైకాపా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే స్వాగతిస్తానని, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తానని చెప్పారు. అలాగే, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాపాక ప్రకటించారు. అలాగే, తాను పార్టీ మారబోతున్న వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తనకు అధినేత పవన్ అని, ఆయనతోనే ఉంటానని ప్రకటించారు. 
 
కాగా, ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన పవన్... శుక్రవారం ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు