రాధాను వైసీపీ పెద్దలు దగ్గరుండి తిట్టిస్తున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. టీడీపీ నేత వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో ఖచ్చితంగా వైసీపీ పెద్దల హస్తం ఉందన్నారు. సోమవారం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ, రాధాకు చరిష్మా ఉన్నందునే కొడాలి నాని, వల్లభనేని వంశీలు రాధా మద్దతు కోసం తహతహలాడుతున్నారన్నారు. మంత్రి వెల్లంపల్లితో రాధాకృష్ణను వైసీపీ పెద్దలు తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి వెల్లంపల్లిది అన్నం పెట్టే చేతినే కొరుక్కుతినే సంస్కృతి అని వ్యాఖ్యానించారు. వెల్లంపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. పోలీసులు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేయలేదనే కారణాలతో కేసును నీరిగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక మంది చేసిన వ్యాఖ్యలు ఆధారంగా సీఐడీ, ఏసీబీలు దర్యాప్తు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు.
రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ ఉందని, రంగా వర్ధంతి రోజు బహిరంగంగా తనపై రెక్కీ చేశారని చెప్పారని గుర్తుచేశారు. వారం రోజులు అయినా పోలీసులు దోషులను పట్టుకోలేదని, గన్ మెన్లను ఇచ్చి ప్రభుత్వం రెక్కీ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఇప్పుడైనా పోలీసులు ఈ కేసును చేదించకపోతే వ్యవస్థపై నమ్మకం పోతుందని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు.