2025 నాటికి క్షయ నిర్మూలనే మన ధ్యేయం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:03 IST)
ప్రాణాంతకంగా పరిణమించిన క్షయవ్యాధి వ్యాప్తి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఆందోళన కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రపంచ టిబి కేసులలో నాలుగోవంతు రెండవ అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు.
 
విజయవాడ రాజ్ భవన్ వేదికగా 71వ టిబి సీల్ సేల్ క్యాంపెయిన్‌ను శుక్రవారం గౌరవ గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్షయవ్యాధికి కారణమయ్యే జీవిని 1882 లోనే రాబర్ట్ కోచ్ కనుగొన్నప్పటికీ, 2019 సంవత్సరంలో కూడా భారతదేశంలో 26.9 లక్షల టిబి కేసులు నమోదు కావటం పరిస్దితి తీవ్రతను తెలియ చేస్తుందన్నారు.

గతంలో క్షయవ్యాధికి చికిత్స అందుబాటులో లేదని, ప్రస్తుతం అనేక ప్రభావవంతమైన ఔషదాల ఆవిష్కరణతో భయంకరమైన వ్యాధి నుండి కోలుకుంటున్నారని బిశ్వభూషణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధితో దాదాపు లక్ష మంది బాధపడుతుండగా,  వ్యాధి నుండి కోలుకుంటున్న రోగులు 91 శాతంగా నమోదు కావటం శుభసూచకమన్నారు.
 
2030 నాటికి టిబిని నిర్మూలించాలని ప్రపంచం లక్ష్యంగా ఎంచుకోగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రపంచ లక్ష్యాని కన్నా ఐదేళ్ల ముందుగానే 2025 నాటికి దేశంలో టిబిని నిర్మూలించాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతున్నారన్నారు. క్షయ నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు టిబి అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రెడ్‌క్రాస్, లెప్రా ఇండియా, టిబి అలెర్ట్, వరల్డ్ విజన్, ఎఎమ్‌జి ఇండియా ఇంటర్నేషనల్, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మొదలైన స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించటం ముదావహమన్నారు.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ, టిబి అసోసియేషన్ రాష్ట్రంలో టిబి వ్యాధి వ్యాప్తిని తగ్గించడం, పూర్తిగా నిర్మూలించడంలో విజయవంతం కావాలని తాను  కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు. టిబి సీల్ సేల్ క్యాంపెయిన్‌కు ప్రతి ఒక్కరూ ఉదారంగా సహకరించాలన్నారు.
 
కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర టిబి అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ టిపి గాంధీ, ప్రధాన కార్యదర్శి బాలచంద్ర, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వేస్లి, రాష్ట్ర టిబి కంట్రోల్ అధికారి డాక్టర్ టి. అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. టిబి సీల్ సేల్ ద్వారా గణనీయమైన మొత్తాలను సేకరించిన గుంటూరు, ప్రకాశం జిల్లాల శాఖల నుండి డాక్టర్ టి రామారావు, డాక్టర్ ఉష, ఉత్తమ సంస్థగా ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అరుణ్ కుమార్ తరుపున స్టీఫెన్‌లను గవర్నర్ మెమోంటోతో సత్కరించారు. 
 
అత్యధిక మంది సభ్యులను నమోదు చేసినందుకుగాను గుంటూరు మెడికల్ కళాశాల టిబి, ఛాతి వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ జయకర్ బాబు, శ్రీకాకుళం టిబి అసోసియేషన్ నుండి డాక్టర్ మంత్రి వెంకట స్వామి అవార్డులు అందుకున్నారు. వ్యక్తిగత హోదాలో డాక్టర్ వేస్లి, స్టీఫెన్, డాక్టర్ మశిలమణిలను గవర్నర్ సత్కరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు