తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు చిచ్చుపెట్టిన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక రాజకీయ నేతల మధ్య ఎన్నో ఆశలను చిగుర్చాయి. ప్రణబ్ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు సమావేశమైతే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని అందరూ భావించారు.
అయితే కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని.. అందుకే రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనలేదని టాక్ వస్తోంది. కానీ కేసీఆర్ నిజంగానే జ్వరం తగిలి ఇంట్లోనే ఉన్నారా.. లేకుంటే రాష్ట్రపతి సమక్షంలో చంద్రబాబు మొహం చూడలేక ఎట్ హోం కార్యక్రమంలో పాలుపంచుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే అభిప్రాయాన్ని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు సమావేశమైతే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని భావించినట్లు తెలిపారు. అయితే, ఆయనకు ఏం జ్వరం వచ్చిందో కాని, సమావేశానికి మాత్రం రాలేదని అన్నారు. కావాలనే కేసీఆర్ సమావేశానికి రాలేదని అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా విమర్శించుకున్నా, పాలన పరంగా సహకరించుకుందామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందుకు రావట్లేదని జూపూడి అన్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చిన మంచి అవకాశాన్ని కేసీఆర్ ఎందుకు వినియోగించుకోలేకపోయారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.