13న ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బాధ్యతల స్వీకారం

సోమవారం, 11 అక్టోబరు 2021 (07:56 IST)
ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్‌ మిశ్రాతో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

జస్టిస్‌ పి.కె.మిశ్రా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతూ.. అక్కడే ఇటీవల తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ కావడంతో హైకోర్టులో వీడ్కోలు పలికారు.

ఇవాళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా విజయవాడ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎం కార్యదర్శి ముత్యాలరాజు, కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్‌, నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు సమీక్షించారు.

సీఎం జగన్‌తో పాటు శాసనసభ స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు.. మొత్తం 200 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు