గుంటూరు: జిల్లా కోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న సి. సుమలతను గుంటూరు జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుమలత చరిత్ర సృష్టించారు.
జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తూనే జిల్లా జడ్జి నియామకాలకు హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఏడేళ్ల క్రితం అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఇన్చార్జిగా పని చేస్తున్న ఒకటో అదనపు జిల్లా జడ్జి గోపిచంద్ నుంచి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశించారు.