జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో బానిస బతుకులు బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు ఆ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 'కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి మేం పార్టీ మారామని జగన్ మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు మేం వేరే పార్టీల నుంచి ఆయన పార్టీలోకి వెళ్లాం. అప్పుడు ఆయన ఎన్ని కోట్ల రూపాయలిచ్చి మమ్మల్ని కొనుక్కొన్నాడు' అని జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వస్తున్న ఈయన ప్రశ్నించారు.
'మేం అమ్ముడుపోయామని ఆరోపణలు చేస్తున్న జగన్ వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరాసలోకి వెళ్తే మాత్రం నోరు మెదపలేదు. మాపై చేసిన ఆరోపణలేవీ ఆయనపై చేయలేదు. ఆయనను కోట్ల రూపాయలకు తానే కేసీఆర్‌కు అమ్మేశారా? అందుకే కిక్కురుమనడం లేదా? మాకు సమాధానం కావాలి. మా నాయకుడివని ఇంతకాలం నిన్ను పొగిడాం. ఇప్పుడు తిట్టడానికి మనస్కరించడం లేదు. కానీ నాది ఒకటే ప్రశ్న. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీ కుటుంబ స్థితిగతులేంటి...? మా కుటుంబ స్థితిగతులేంటి? ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎంత? బహిరంగంగా మీడియా ముందు శ్వేత పత్రాలు ఇద్దాం. చర్చిద్దాం. చేతనైతే రా' అని ఆయన సవాల్ విసిరారు.
జగన్ దగ్గర కట్టు బానిసల్లా ఉన్నామని, కట్టడిలో బతికామని ఆవేదన వ్యక్తం చేశారు. నేను శాసనసభాపక్షానికి ఉప నేతను. అయినా జగన్ పక్కన కూర్చోకూడదు. ఐదు సమావేశాల్లో మూడు సమావేశాల్లో నన్ను కూర్చోనివ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సీట్లో ఒక్కడే కూర్చుంటున్నారు కాబట్టి తానూ ఒక్కడే కూర్చోవాలన్నది జగన అహంకారం అని నెహ్రూ మండిపడ్డారు.