ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

ఐవీఆర్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (22:24 IST)
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
 
"యునైటెడ్ బై యూనిక్" అనే థీమ్‌‌తో నిర్వహించిన ఈ కార్యక్రమం, క్యాన్సర్ వ్యతిరేక పోరాటంలో సమాజం ఏకతాటిపై రావాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ వైద్యుల్లో డా. సుధాకర్ కంటిపూడి, డా. కృష్ణా రెడ్డి, డా. శ్రవణ్ కుమార్, డా. ధర్మేంద్ర, డా. దినేశ్ రెడ్డి, డా. రామకృష్ణ మరియు డా. శ్రీదివ్య లు ఉన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు తమ అనుభవాలను పంచుకున్నారు, తాజా చికిత్సా సాంకేతికతల గురించి అవగాహన పొందడంతో పాటు, ముందుగా గుర్తించడం ఎంత ముఖ్యమో నిపుణుల సహాయంతో తెలుసుకోవాలన్నారు.
 
మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, తన సామాజిక బాధ్యతలో భాగంగా, గత 12 ఏళ్లుగా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఆంధ్రప్రదేశ్ లోని పల్లె ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఉపయోగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 50,000 మందికి పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం విశేషం. ఇది క్యాన్సర్ ను తొందరగా గుర్తించి, సమయానికి చికిత్స అందించేలా చేయడమే లక్ష్యంగా కొనసాగుతోంది.
 
ఈ అవగాహన కార్యక్రమంపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖరబాబు (ఐపిఎస్), ఎస్ సతీష్ బాబు, ఎస్పీ, గుంటూరు మాట్లాడుతూ, "ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్స్కి అభినందనలు తెలిపారు. క్యాన్సర్ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. అయితే, ముందుగా గుర్తించడం, అవగాహన పెంపొందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. సమాజానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరం." అని పేర్కొన్నారు.
 
క్యాన్సర్ చికిత్సలో వస్తున్న పురోగతిని ప్రస్తావిస్తూ, మణిపాల్ హాస్పిటల్స్ ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డా. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, "క్యాన్సర్ చికిత్స చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ప్రత్యేక థెరపీలు, మెరుగైన చికిత్స విధానాలు రోగులకు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో, మేము ఈ కొత్త చికిత్సా పద్ధతులను ముందుండి అందిస్తున్నాము. ప్రతి రోగికి అవసరమైన ప్రత్యేక సేవలు అందిస్తూ, వారి ఆరోగ్యం మెరుగుపడేలా కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమం, అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స అందరికీ చేరువ చేయడంలో మరో ముందడుగు" అని అన్నారు.
 
తొందరగా గుర్తించడమే క్యాన్సర్ చికిత్సలో కీలకం అని చెబుతూ, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. ధర్మేంద్ర మాట్లాడుతూ, "తొలినాళ్లలో క్యాన్సర్ ని గుర్తిస్తే, ఇది పూర్తిగా నయం అవ్వవచ్చు. అందుకే స్క్రీనింగ్ పరీక్షలు చాలా అవసరం." అని అన్నారు. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ క్లస్టర్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, "మేము అవగాహన కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ పరీక్షలు, ఉచిత సంప్రదింపులు అందించడానికి కట్టుబడి ఉన్నాము. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందించి, రోగులకు ఉత్తమమైన సేవలు అందించడమే మా లక్ష్యం." అని తెలిపారు. ఈ కార్యక్రమం "అవగాహన ప్రాణాలను రక్షిస్తుంది, తొందరగా గుర్తించడం అత్యంత కీలకం" అనే బలమైన సందేశంతో ముగిసింది. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని, పరీక్షలు చేయించుకుని, ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు