కడప పట్టణంలోని ఆకులవీధులో ఉండే మౌనిక.. అశోక్ నగర్‌కు చెందిన హర్షవర్ధన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో మౌనిక తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణకోసమని జిల్లాలోని చిన్నచౌక్ పోలీసులను ఆశ్రయించారు. ఇరువురినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సీఐ రామకృష్ణ విచక్షణా రహితంగా కొట్టి నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు.
దీంతో పోలీస్ స్టేషన్‌లోనే మౌనిక సొమ్మసిల్లి పడిపోయింది. అబ్బాయి తరపు బంధువులు 108వాహనాన్ని పిలిపించగా.. ఆగ్రహించిన సీఐ ఆ వాహనాన్ని తిరిగి పంపించేశారని బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక ఆడబిడ్డను పట్టుకుని బాధ్యతగల సీఐ విచక్షణా రహితంగా కొట్టడమేంటి.?.. ఒక వేళ మా బిడ్డ చనిపోయివుంటే మీరు ఏం చేసివుండే వాళ్లంటూ బాధితురాలి బంధువులు పోలీసులను ప్రశ్నించారు.
కానీ, సీఐ వాదన మాత్రం మరోలా ఉంది. పోలీసులను ఆశ్రయించగానే ఇద్దర్నీ వారి తల్లిదండ్రులకు అప్పజెప్పాము.. ఈ క్రమంలో మౌనిక ఇంటికిపోను అని మొరాయించడంతో ఆ యువతి తండ్రి బుద్ది చెప్పడం జరిగింది.. దీన్ని ఆసరాగా తీసుకుని హర్షవర్ధన్‌ను సంబంధించిన కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి మౌనికను ఇంటికి తీసుకెళతామన్నారు. అంతే ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదంటూ సీఐ చెప్పడం గమనార్హం.