కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల బి.సిల ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినవు, కాపులను బి.సిల్లో కలపడాన్ని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. ప్రస్తుతం బి.సిలకు ఉన్న రిజర్వేషన్ శాతంలో ఏ మాత్రం మార్పు ఉండదు. బి.సిల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా షెడ్యూల్-9 లో కాపులకు అదనంగా 5 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు.
కాపు రిజర్వేషన్ కేవలం విద్యా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకే పరిమితమవుతుందన్నారు. ఏ సామాజికవర్గమైనా ఆర్థిక, విద్య, ఉద్యోగ అంశాలలో వెనుకబడి వుంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నారు. బి.సిలకు నష్టం జరగనప్పుడు కాపు రిజర్వేషన్‌ను పెద్ద మనస్సుతో ఆహ్వానించాలన్నారు.
కాపు రిజర్వేషన్‌ను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీ కుట్ర పన్నిందని, అసెంబ్లీలో బిల్లు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రిగారు ప్రతిపక్షనాయకుడికి సరైన సమాధానం చెప్పారని తెలిపారు. అలాగే వాల్మీకి, బోయలను ఎస్టీలలో చేర్చడాన్ని స్వాగతిస్తున్నానని, వారి చిరకాల కోరిక నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ బి.సిల పార్టీ, వారి ప్రయోజనాలకు భంగం కలిగే ఏ పనీ చేయదన్నారు.